పూర్తయిన ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనం

By on Sep 23, 2018 in Festivals and Traditions

దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. 11 రోజుల పాటు ఘనంగా పూజలందుకున్న 57 అడుగుల భారీ బొజ్జ గణపయ్యను దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు తరలివచ్చారు. ఉదయం ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర మొదలైంది. జై బోలో గణేశ్ మహరాజ్ కీ నినాదాలతో యాత్ర ఆద్యంతం హోరెత్తింది.

అశేష భక్త జనవాహిని ముందు నడుస్తుండగా ఖైరతాబాద్ వినాయకుడు వడివడిగా అడుగులేస్తూ మధ్యాహ్నం పన్నెండున్నరకు హుస్సేన్ సాగర్ కు చేరుకున్నాడు. ఆరో నెంబర్ క్రేన్ దగ్గర ఖైరతాబాద్ మహాగణపతికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత నిమజ్జనోత్సవం జరిగింది. ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం కోసం ప్రత్యేకంగా క్రేన్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెళ్లిరావయ్యా మహా గణపయ్యా అంటూ భక్తజనమంతా ఘనంగా వీడ్కోలు పలికారు.

ఖైరతాబాద్ మహా గణేశుడి నిమజ్జనోత్సవానికి చూసేందుకు భక్తజనం వేలాదిగా హుస్సేన్ సాగర్ కు తరలివచ్చారు. మహా నిమజ్జనాన్ని కనులారా చూసి పరవశించారు. భారీ క్రేన్ సాయంతో బొజ్జ గణపయ్య గంగమ్మ చెంతకు తరలిపోతున్న తరుణంలో భక్తజనం నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. జై బోలో గణేశ్ నినాదాలు చేస్తూ అశేష భక్తజనవాహిని విఘ్ననాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికింది.

<
>