భాషా సాంస్కృతిక శాఖ: రవీంద్రభారతిలో సినిమాలకోసమై ప్రత్యేకంగా ఒక థియేటర్ ను ఏర్పాటుచేయడం సాధారణమైన విషయంకాదు – ప్రముఖ ఆర్కిటెక్చర్ శ్రీనివాస్ సుల్గే – ఘనంగా ఫంటాస్టిక్ ఫైవ్ ఫిల్మ్ (ఫ్రెంచ్) ఫెస్టివల్ ముగింపు కార్యక్రమం -20.07.18

రవీంద్రభారతిలో సినిమాలకోసమై ప్రత్యేకంగా ఒక థియేటర్ ను ఏర్పాటుచేయడం సాధారణమైన విషయంకాదు – ప్రముఖ ఆర్కిటెక్చర్ శ్రీనివాస్ సుల్గే – ఘనంగా ఫంటాస్టిక్ ఫైవ్ ఫిల్మ్ (ఫ్రెంచ్) ఫెస్టివల్ ముగింపు కార్యక్రమం

తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ మరియు అల్లియన్స్ ఫ్రాంచైజ్ సంయుక్తంగా జూలై 16 నుండి 20వరకు నిర్వహించిన ఫ్రెంచ్ ఫిలిం ఫెస్టివల్ (ఫెంటాస్టిక్ ఫైవ్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇంటర్నేషనల్) ముగింపు కార్యక్రమం శుక్రవారం సాయంత్రం రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సంచాలకులు మామిడి హరికృష్ణ గారు, ప్రముఖ ఆర్కిటెక్చర్ శ్రీనివాస్ సుల్గే గారు, మలయాళీ అసోసియేషన్ అధ్యక్షులు లిబి బెంజిమన్ గారు విచ్చేశారు.

మలయాళీ అసోసియేషన్ అధ్యక్షులు లిబి బెంజిమన్ గారు మాట్లాడుతూ… సినిమాలు మనిషి జీవితంపై అత్యంత ప్రభావాన్ని చూపిస్తాయని, సినిమాల్లో మంచి-చెడు రెండూ ఉంటాయిని వాటిల్లో దేన్ని స్వీకరించాలో మనిషే నిర్ణయించుకోవాలన్నారు. కల్చరల్ డైరెక్టర్ గా మామిడి హరికృష్ణ గారు అన్ని కళలకు తగినంత ప్రోత్సాహాన్ని అందిస్తున్నారని, ఆయన ప్రేరణతో మలయాళీ అసోసియేషన్ అనేక కార్యక్రమాలు నిర్వహించిందని, అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి మంచి సపోర్ట్ కూడా లభిస్తుందని తెలుపుతూ, తమకు సహకరిస్తున్న ప్రభుత్వానికి, సాంస్కృతిక శాఖకు ధన్యవాదాలు తెలిపారు.

ప్రముఖ ఆర్కిటెక్చర్ శ్రీనివాస్ సుల్గే గారు మాట్లాడుతూ… హైదరాబాద్ లోని ఎల్.బి. స్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాన్ని చూసి తాము కూడా ముంబైలోని ఒక స్టేడియంలో 15వేలమందితో బతుకమ్మ పండగను నిర్వహించామని తెలుపుతూ, తెలంగాణ వచ్చిన తరువాత గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ కళలు మంచి ఆదరణ, గుర్తింపు లభిస్తుందన్నారు. రవీంద్రభారతిలో సినిమాలకోసమై ప్రత్యేకంగా ఒక థియేటర్ ను ఏర్పాటుచేయడం సాధారణమైన విషయంకాదని, ప్రతిఒక్కరూ ఈ వేదికను వియోగించుకోవాలని పేర్కొంటూ సంచాలకులు మామిడి హరికృష్ణ గారిని అభినందించారు.

విచ్చేసిన ప్రేక్షకులు ఫెస్టివల్ గురించి స్పందిస్తూ… గత ఐదు రోజులుగా ప్రదర్శించిన చిత్రాలు చాలా బాగున్నాయని, యంగ్ ఫిలిం మేకర్స్ వాటినుంచి చాలా నేర్చుకోవచ్చని వెంకన్న తెలుపగా… వచ్చిన ప్రేక్షకులు కేవలం సినిమా ప్రదర్శనలు చూసి వెళ్ళడమేకాకుండా, అవి ఎందుకు గొప్ప సినిమాలు అయ్యాయో తెలుపుతూ వాటి గురించి విశ్లేషణ చేస్తే బాగుంటుందని శ్రీనివాసు గారు సూచించారు.

సంచాలకులు మామిడి హరికృష్ణ గారు మాట్లాడుతూ… శ్రీనివాసు గారు మంచి సూచన చేశారని, సినిమా ప్రదర్శన తరువాత విశ్లేషణ చేయడంకోసం ప్రతి ఆదివారం సండేసినిమా అనే కార్యక్రమం ఏర్పాటుచేశామని, అందులో వరల్డ్ బెస్ట్ సినిమాలను ప్రదర్శిస్తూ వాటిలోని ప్రతి అంశం గురించి యంగ్ ఫిలిం మేకర్స్ కు అర్థమయ్యేవిధంగా విశ్లేషణలతో కూడిన చర్చావేదిక ఉంటుందని తెలిపారు. సినిమా చూసిన ప్రేక్షకుడు తన ఊహలో, తన దృక్పథంలో సినిమాను అర్థంచేసుకునేలా ఒక అసైన్ మెంట్ లా ఈ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించాలకున్నామని… సృజన, ఆలోచనలతో ఊహాశక్తిను పెంచడంకోవడం, తనలో మెదులుతున్న ప్రశ్నలకు జవాబులను అన్వేషించేలా చేయడం ఈ ఫెస్టివల్ ముఖ్యోద్దేశ్యమని, అందుకే ఈ కార్యక్రమంలో విశ్లేషణలు పెట్టలేదన్నారు, ఇంతమంచి సినిమాలు అందించిన అల్లియన్స్ ఫ్రాంచైజ్ వారికి, సినిమా మీద ప్రేమతో ఇక్కడికి విచ్చేసి ఈ ఫెస్టివల్ ను విజయవంతంచేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం, మామిడి హరికృష్ణ గారు విచ్చేసిన అతిథులను శాలువాలతో సత్కరించారు.

<
>

(courtesy: తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ)