రికార్డ్ ధర రూ.16 లక్షల 60వేలు పలికిన బాలాపూర్ గణేష్ లడ్డు 

By on Sep 23, 2018 in Festivals and Traditions

రికార్డ్ ధర రూ.16 లక్షల 60వేలు పలికిన బాలాపూర్ గణేష్ లడ్డు 

బడంగ్‌పేట్ సెప్టెంబర్ 23 : బాలాపూర్ లడ్డూకు క్రేజ్ మరింత పెరిగింది. గ్రామ ముఖ్య కూడలి బొడ్రాయి వద్ద బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాట నిర్వహించారు. ఈ ఏడాది బాలాపూర్ గణనాథుడి లడ్డూను వేలంలో ఆర్యవైశ్య సంఘం దక్కించుకుంది. ఆర్యవైశ్య సంఘం తరఫున బాలాపూర్ వాసి టీ. శ్రీనివాస్ గుప్తా లడ్డూ అందుకున్నారు. వేలంలో బాలాపూర్ గణేష్ లడ్డూ16 లక్షల 60వేలు పలకడం విశేషం. గతేడాది కంటే ఈ ఏడాది గణపయ్య లడ్డూ రూ.లక్ష ఎక్కువ పలికింది. లడ్డూ వేలం పాటకు ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, భాగ్యనగర్ ఉత్సవ సమితి అధ్యక్షుడు ఘవరెడ్డి, వ్యాపార, వాణిజ్య, రాజకీయ ప్రముఖులు, రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నిమజ్జనం రోజు జరిగే బాలాపూర్ లడ్డూ వేలానికి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది.

బాలాపూర్ గణపతికి, ఆయన చేతి లడ్డూకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నగరానికి దక్కిన ఈ ఖ్యాతి, ప్రపంచం నలుమూలా ఆసక్తిని రేకెత్తించింది. ఏటా వచ్చే వినాయక చవితి పేరు చెబితే మొదటగా గుర్తొచ్చేది బాలాపూర్ గణేశుని లడ్డూనే. 1980లో మొదలైన బాలపూర్ వినాయ‌కుడి ప్రస్థానం.. 23 ఏళ్లుగా లడ్డూ వేలం పాటతో మరింత ఖ్యాతిని చాటుకుంది. లంబోదరుడిని మనసారా దర్శించుకొని ఆయన చేతిలో ఉన్న లడ్డూ చేజిక్కించుకుంటే సిరిసంపదలు దక్కుతాయని భ‌క్తుల‌ విశ్వాసం. బాలాపూర్ లడ్డూకు దేశంలోనేగాక ప్రపంచ వ్యాప్తంగా విశేషాద‌ర‌ణ వ‌స్తోంది. మొదట 450రూపాయలతో ప్రారంభమైన లడ్డూ వేలం…క్రమంగా వందలు, వేలు దాటి లక్షలకు చేరింది.

1994లో కోలన్ మోహన్‌రెడ్డి మొదటిసారిగా లడ్డూను రూ.450లకు దక్కించుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు లడ్డూ ధర పెరుగుతూ వస్తున్నది తప్ప తగ్గిన సందర్భాలు లేవు. 1994లో రూ.450ఉన్న లడ్డూ 2017లో నాగారం తిరుపతిరెడ్డి రూ.15.60 లక్షలకు దక్కించుకున్నారు.