Kalavaibhavam.com (01.10.19): తెలుగు సినిమారంగంలో స్మాల్ టౌన్ సినిమాలు రావాలి: సంచాలకులు మామిడి హరికృష్ణ

తెలుగు సినిమారంగంలో స్మాల్ టౌన్ సినిమాలు రావాలి: సంచాలకులు మామిడి హరికృష్ణ

తెలుగు సినిమా అనగానే పెద్ద పెద్ద నగరాల్లో షూటింగ్ చేయాలన్ని అలోచన వస్తుందని, అలాకాకుండా స్మాల్ టౌన్ సినిమాలు ఎక్కువగా రావలసిన అవసరముందని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అన్నారు.

తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న బతుకమ్మ ఫిల్మోత్సవం (2019)లో మంగళవారం సాయంత్రం రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్ర ప్రదర్శన జరిగింది. ప్రదర్శన అనంతరం జరిగిన ముఖాముఖి కార్యక్రమానికి చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్, యూనిట్ సభ్యులు ప్రదీప్, వెంకట్, శ్రీహరి, సాయి, సురేందర్, యోహన్ విచ్చేసి ప్రేక్షకులతో చిత్ర అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి సంచాలకులు మామిడి హరికృష్ణ విచ్చేసి చిత్రబృందాన్ని శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా,

మామిడి హరికృష్ణ మాట్లాడుతూ… అన్ని వస్తువులకు ఉన్నట్లుగా సినిమాకు మార్కెట్ రీసెర్చ్ ఉండదని, సినిమాలలో రీసెర్చ్ మరియు ఫిలింమేకింగ్ ఏకకాలంలో జరుగుతుందని అన్నారు. సినిమా అనేది హైపోథీసిస్ పై ఆధారపడి ఉంటుందని, బతుకుమ్మను పేర్చేటప్పుడు పూలను ఎలా అలంకరిస్తామో సినిమాను కూడా అంత చక్కగా రూపొందించాలని తెలిపారు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాకు కథ, కథనాలే బలం అని … దర్శకుడు స్వరూప్, నటుడు నవీన్ పొలిశెట్టి, నిర్మాత రాహుల్ యాదవ్ ముగ్గురు త్రిమూర్తులై సినిమాను నడిపించారని అన్నారు. సినిమా ఆర్ట్ విలువను చూపించే సినిమాలనే బతుకమ్మ ఫిల్మోత్సవంలో ప్రదర్శిస్తూ వస్తున్నామని పేర్కొంటూ, ఈ టీం నుండి మరిన్ని మంచి చిత్రాలు తీయాలని అంకాంక్షించారు.

నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ… సినిమాలో లవ్ ట్రాక్ లేకుంటే సక్సెక్ కాదని చాలామంది చెప్పారని, ప్రేక్షకులకు నచ్చే సినిమాలను తీస్తే ఖచ్చితంగా ఆదరిస్తారన్న నమ్మకంతో సినిమాను తీశామని, తమ నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో యంగ్ ఫిలిం మేకర్స్, సినీప్రియులు మరియు పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ టీం పాల్గొన్నారు.