Kalavaibhavam.com(4-Feb): గవర్నరు తమిళసై సౌందరరాజన్ ను కలిసిన గణతంత్ర దినోత్సవంలో తెలంగాణ శకటం తరపున పాల్గొన్న కళాకారుల బృందం సభ్యులు

By on Feb 4, 2020 in Other Venues

గవర్నరు తమిళసై సౌందరరాజన్ ను కలిసిన గణతంత్ర దినోత్సవంలో తెలంగాణ శకటం తరపున పాల్గొన్న కళాకారుల బృందం సభ్యులు

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న 26 మంది కోయ, గోండి, బంజారా, తోటి, ప్రధాన్, డోలి తదితర గిరిజన బృందాలు,

ఈ రోజు రాజభవన్ లోని దర్బార్ హాలులో గవర్నరు డాక్టర్ తమిళసై సౌందరరాజన్ ఎదుట తమ గిరిజన సాంప్రదాయ నృత్య  ప్రదర్శనలు ఇచ్చారు. 

రేలా రే రేలా రాగంలో గుస్సాడి, కొమ్ము కోయ నృత్యాలను తమ సాంప్రదాయ దుస్తులు, వాయిద్య సహకారంతో చక్కగా అభినయించిన గిరిజన కళాకారులు ఆహుతుల్ని అలరించారు.  కళాకారుల ప్రదర్శనను చూసి ముచ్చడపడ్డ గవర్నరు శ్రీమతి తమిళసై కూడా  కళాకారులతో కలిసి కొంతసేపు నృత్యమాడారు. 

తెలంగాణా రాష్ట్రంలోని గిరిజనుల సమగ్ర అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని, ఇది తన బాధ్యతగా తీసుకున్నానని గవర్నరు అన్నారు. తెలంగాణా కుంభమేళాగా కీర్తించబడుతున్న సమ్మక్క – సారమ్మ ఉత్సవాలకు జనవరి 7న తాను హాజరవుతున్నానని ఆమె తెలిపారు.

ఢిల్లీ  పెరేడ్ గ్రౌండ్స్ లో రిపబ్లిక్ దినోత్సవంనాడు  ఈ కళాకారులు ఇచ్చిన గుస్సాడి, కొమ్ముకోయ నృత్య ప్రదర్శనలకు గాను నాల్గవ బహుమతి లభించిందని కోయ గిరిజన అధ్యయన సంస్థ, అధ్యక్షులు, ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు తెలిపారు.  దేశం మొత్తం నుండి 23 గిరిజన బృందాలు ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నాయని ప్రొఫెసర్ జయధీర్ తెలిపారు.

అనంతరం, గిరిజన కళాకారులందరినీ గవర్నరు శాలువ, జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన అధ్యయన సంస్థ తరఫున ప్రొఫెసర్ జి. మనోజ, శ్రీమతి సోయం సుగుణాబాయి, శ్రీమతి పద్దం అనసూయ, శ్రీ జల్లి దామయ్య తదితరులు పాల్గొన్నారు.