Kalavaibhavam.com(6-Feb): మూడు తరాల రాగబంధం… ఆరుతరాలతో బామ్మకు సన్మానం

(కె.ఎల్. నరసింహా రావు – editor@kalavaibhavam.com)

మూడు తరాల రాగబంధం… ఆరుతరాలతో బామ్మకు సన్మానం

అదో అందమైన ప్రపంచం. ఆ…కాదు…కాదు…అంత కన్నా అందమైన కుటుంబం. అదో లోకమైతే…ఇలాగే వుంటుంది. మరి మనం కూడా చూసొద్దామా! ఎంత దూరమో అని ఆలోచిస్తున్నారా? దగ్గరే…మన దగ్గరే…కళ్యాణ దుర్గం దగ్గరలో శెట్టూరు మండలం, బసం పల్లికి వెళ్లొద్దాం….

అనుకోకుండా ఓ రోజు …కాదులే…అందరూ అనుకొన్న ఓ రోజు. అది నిజంగానే అందమైన రోజు. ఆ రోజు 26 జనవరి, 2020. ఆరు తరాలు ఒక్కటైనా రోజు… మూడు తరాల ముచ్చట్లుగా ఆనందాలు సాగిపోయాయి. ఆత్మీయత కలిసి మురిసింది. పండగ చేసుకున్నది. వీరందరి మధ్య అన్యోన్యం, కలివిడితనం, అనుబంధాలు, ఆనందం అవదులు దాటినంత జ్ఞాపకాలు పదిలం చేశాయి.

వివరాలలోకి వెళితే….

ఒక బామ్మ. ఆమెకు 96 ఏళ్లు. ఆమె వారసులు ఆరు తరాలు. మూడు తరాలు చూడడమే ఎంతో గొప్ప అనుకునే రోజులివి. కాని ఆ బామ్మ డబుల్ హాట్రిక్ తరాలను చూసి మురుస్తోంది. ఆమె సంతానం18 కుటుంబాలుగా, 70 మంది సభ్యులగా శాఖీయమైంది. అందరూ ఒక చోట చేరారు. ఆమెకు చిన్ననాటి గుర్తులు, మలి వయసు జ్ఞాపకాలు కళ్ల ముందు కదిలేలా ఏకమై ప్రత్యేకమయ్యారు. బామ్మను అబ్బురపరిచారు.

అందులో తొమ్మిది నెలల మనవరాలు కూడా వుంది. ఆ పసి మనసు కూడా బోసి నవ్వుల బామ్మను బోసి మనవరాలు పలకరించి, నువ్వంటే నువ్వు ముసలి అనుకున్నారు.

96 ఏళ్ళ బామ్మ వెంకటమ్మ ఇప్పటికీ తనపని తానే చేసుకొంటూ ఆరోగ్యoగా ఉండటం మా కుటుంబ సభ్యులందరినీ మరింత సంతోష పరుస్తుందని కుమారుడు గోవింద చౌదరి తెలిపారు. అందరూ కలిసి బామ్మకు సన్మానం చేసి తరించి, దీవెనలు పొందారు. ఆమె సేవలో తరించారు.