Kalavaibhavam.com (31.08.19): ” మైమ్ ఆర్ట్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ 2019 ” హైదరాబాద్ నగరంలో జరగడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం – మైమ్ ఫెస్టివల్ ముగింపు సభలో హరీష్ రావు – పద్మశ్రీ నిరంజన్ గోస్వామికి స్వర్ణకంకణ ప్రదానం

By on Aug 31, 2019 in Ravindra Bharathi

” మైమ్ (MiM Arts International – 2019) ఆర్ట్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ 2019 ”  హైదరాబాద్ నగరంలో జరగడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం – మైమ్ ఫెస్టివల్ ముగింపు సభలో హరీష్ రావు – పద్మశ్రీ నిరంజన్ గోస్వామికి స్వర్ణకంకణ ప్రదానం

” మైమ్ (MiM) ఆర్ట్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ 2019 ” (అంతర్జాతీయ మైమ్ ఫెస్టివల్) మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నగరంలో జరగడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని హరీష్ రావు అన్నారు. మాటలు లేకుండా కేవలం భావాన్ని పలికించే గొప్ప కళ మైమ్ అని అన్నారు. మూడవరోజు ముగింపు వేడుకలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్ఏ తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కళాకారులతో మైమ్ ఫెస్టివల్ నిర్వహించిన ఆరుసం మధు అబినందనీయుడన్నారు. తెలంగాణ ప్రభుత్వం కళలు, కళాకారులకు పెద్ద పీట వేస్తుందన్నారు.

ఇండియన్ మైమ్ అకాడమీ, అలయన్స్ ఫ్రాంచైజీ సంయుక్త నిర్వహణలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శనివారం రవీంద్రభారతి వేదికగా మూడు రోజుల పాటు వైవిద్యభరితమైన మైమ్ కళాప్రదర్శనలతో అలరించిన ” మైమ్ (MiM) ఆర్ట్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ 2019 ” అంతర్జాతీయ మూకాభినయ ఉత్సవం శనివారం ఘనంగా ముగిసింది.

ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ మైమ్ లో తాను గోల్డ్ మెడలిస్టునని, ప్రతి కళాకారుడికి తన శరీరం పై పట్టు ఉండేందుకు మైమ్ కళ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఒక సినిమా కళాకారుడిగా మైమ్ గొప్పదనమేంటో తనకు తెలుసునన్నారు. ” మైమ్ (MiM) ఆర్ట్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ 2019 ” హైదరాబాద్ లో జరగడం అభినందనీయమన్నారు.

ఫ్రెంచ్ నుంచి విచ్చేసిన మైమ్ కళాకారిణి ఎలినా సెరెలా, ఇండియన్ మైమ్ కళాకారుడు ఆరుసం మధుసూదన్ మాటలు లేకుండా కేవలం తమ అభినయంతో మైమ్ కళా ప్రదర్శనలు ప్రేక్షకులని మంత్రముగ్దుల్ని చేసాయి.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా. కే.వి. రమణాచారి, తెలంగాణ భాష సాంస్కృతిక శాఖా సంచాలకులు మామిడి హరికృష్ణ, తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మైన్ బి. శివకుమార్, ప్రముఖ నటుడు, నట కిరీటి రాజేంద్రప్రసాద్, సీఎం ఓ.ఎస్.డి దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొని ప్రఖ్యాత మైమ్ కళాకారుడు పద్మశ్రీ నిరంజన్ గోస్వామికి స్వర్ణ కంకణం ప్రదానం చేసారు. ఈ సందర్బంగా కళాకారులకు ఘనంగా సత్కరించారు.