Kalavaibhavam.com(5-Feb): అంగరంగవైభవంగా మేడారం జాతర ప్రారంభం

అంగరంగవైభవంగా మేడారం జాతర ప్రారంభం

ఇది జన జాతర.. మన జాతర, గిరిజన జాతర.. సమ్మక్క సారలమ్మల వీర చరిత జాతర.. ఆదివాసీల ఆత్మ గౌరవ జాతర.. పరాశక్తుల పౌరుష జాతర.. ఇది జన జాతర.. వనమే జనమైన జాతర… ములుగు జిల్లా , తాడ్వాయి మండలం మేడారం లో జరిగే అతి పెద్ద గిరిజన జాతర. కొయా గిరిజన సాంప్రదాయాలతో కుంకుమ బరనే ఆదిశక్తి స్వరూపాలుగా బెల్లం బంగారంగా తల్లులకు సమర్పించే అరుదైన జాతర. ప్రతి రెండేళ్లకోసారి మాఘశుద్ద్య  పౌడ్యమి  రోజు జాతర ప్రారంభం అవుతుంది. జిల్లా నుండి రాష్ట్రం నుండే కాదు చతిస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ తదితర అనేక రాష్ట్రాల నుండి కోటి మందికి పైగా భక్తులు తల్లులను దర్శించుకుంటారు.  కోట్ల మంది దర్శించుకున్నా ఎవరికి ఇసుమంతైన హాని జరగకపోవడం  తల్లుల మహిమకు చిహ్నంగా భక్తులు భావిస్తారు.  జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్లు మంజూరి చేసి తాత్కాలిక , శాశ్వత పనులు చేపట్టింది. మరుగుదొడ్లు, అదనపు స్నాన ఘట్టాలు, బ్యాటరీ ట్యాప్స్, అంతర్గత రోడ్లు, వైద్యం, వసతి, పారిశుద్ధ్యం, నిరంతర విద్యుత్ సరఫరా, రహదారుల అభివృద్ధి తదితర అనేక  అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేసింది. జాతర విజయవంతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి  సారించింది.  జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో  పర్యటించి గత జాతర అనుభవాలను పరిగణనలోకి తీసుకొని ఏర్పాట్లను విస్తృత పరిచారు. వాహనాల పార్కింగ్ స్థలాలు గద్దెల కు దూరంగా  ఏర్పాటు చేయడం, రోడ్ల వెడల్పు, నూతన రోడ్లు, మరమ్మత్తులు , రవాణా వ్యవస్థను నియంత్రించడం ద్వారా ట్రాఫిక్ సమస్యలను అధిగమించడంలో యంత్రాంగం సఫలీకృతులయ్యారు. వివిధ శాఖల ద్వారా చేపట్టిన 5 వసతి షెడ్లను భక్తులకు,వాలేంటీర్లు, ఆదివాసీ పూజారులకు అందుబాటులోకి తెచ్చారు. మేడారం  పరిసర ప్రాంతాల్లో 229 సోలార్ లైట్ల ను ఏర్పాటు చేశారు. ఈ జాతరను ప్లాస్టిక్ రహిత జాతరగా నిర్వహించేందుకై చర్యలు చేపట్టారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు   50 కేంద్రాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.  జాతర మొత్తం లో 100 ఎల్ ఈ డీ స్క్రీన్ లను ఏర్పాటు చేశారు. జాతర నిర్వహణను పర్యవేక్షించేందుకై 300 సి సి కెమెరాలు, పది డ్రోన్ కెమెరాలను సైతం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి సెంట్రల్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ జరుగుతోంది. జాతర సజావుగా జరిపేందుకు జిల్లా యంత్రంగం మేడారాన్ని నిరంతర నిఘా నేత్రంలో మానిటర్ చేస్తోంది. చీఫ్ సెక్రటరీ క్షేత్ర స్థాయిలో పర్యటించి పనులను పరిశీలించడం ద్వారా  ప్రభుత్వం జాతరకు ఇచ్చే ప్రాముఖ్యత స్పష్టమవుతోంది.

శాఖల వారీగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు:

ఆర్ అండ్ బి శాఖ :
మేడారం వెళ్లే రహదారుల నిర్మాణం, రోడ్డు వెడల్పు, మరమ్మతులు  8.5 కోట్లతో తదితర పనులు చేపట్టి పూర్తి చేశారు.

పంచాయితీ రాజ్, ఇంజనీరింగ్ శాఖ :
పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా ప్రస్తుతం ఉన్న తొమ్మిది రహదారుల విస్తరణ, మరమ్మతుల నిర్వహణ కు కేటాయించిన  మూడున్నర కోట్లతో పనులు పూర్తి చేశారు.   పంచాయితీ రాజ్ పారిశుధ్య  విభాగం ద్వారా పలు  పనులను చేపట్టేందుకై రూ 366 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులతో ప్రధానంగా నాలుగు డంపింగ్ యార్డుల నిర్మాణం, 300 మినీ డంపింగ్ యార్డుల నిర్మాణం, చెత్త తరలింపుకై 3450 మంది పారిశుధ్య కార్మికులను ప్రత్యేకంగా రప్పించారు, జాతర ముందు, జాతర అనంతరం మేడారం లో పారిశుధ్య పనులు నిర్వహించి ఏవిధమైన పరిశుభ్రం లేకుండా ఉండేవిధంగా చర్యలు పేపట్టారు. అవసరమైనతే చెత్త తరలింపు కు మరిన్ని ట్రాక్టర్లు తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.

నీటిపారుదల శాఖ :
మేడారం వచ్చే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు నీటిపారుదల శాఖ నాలుగు కోట్ల రూపాయలతో విస్తృత ఏర్పాట్లను చేపట్టింది. ఇప్పటికే జంపన్న వాగులో ఉన్న  స్నానఘట్టాలకు మరమ్మతులు,గతంలోని 354 బ్యాటరీ నల్లాల ఏర్పాటు, నూతన స్నాన ఘట్టాల నిర్మాణం, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు జంపన్న వాగు 3.5 కిలోమీటర్ల పొడవునా 132 ప్రత్యేక కంపార్టుమెంట్ల నిర్మాణం తదితర పనులను నీటిపారుదల శాఖ చేపట్టింది.

గిరిజన సంక్షేమ శాఖ :
మేడారం అదే విదంగా మేడారం పరిసర గ్రామాల్లో  నాలుగు కోట్ల రూపాయల వ్యయం తో గిరిజన సంక్షేమ శాఖ 35 పనులు చేపట్టింది.  రోడ్లను మరమ్మతులు , వి ఐ పి పార్కింగ్ అభివృద్ధి జాతరలో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి వసతి కల్పించడం తదితర పనులను చేపట్టారు.   అలాగే రూ 6.35  కోట్లతో మూడు శాశ్వత షెడ్ ల నిర్మాణం పూర్తి అయ్యి ఈ ఏడాది భక్తులకు అందుబాటులోకి తెచ్చారు.

ఆర్ డబ్ల్యుఎస్ :
ఆర్ డబ్ల్యు ఎస్ శాఖ ద్వారా 19 కోట్లతో   జంపన్నవాగు వద్ద 538 బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్,  44 ఇన్ ఫిల్టరేషన్ వెల్స్ చేపట్టారు. అదే విదంగా 8400 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. అలాగే మూడు ఓవర్ హెడ్ ట్యాంకులు ఏర్పాటు చేసి త్రాగునీరు అందిస్తున్నారు.

పంచాయతీరాజ్ :
పారిశుధ్య నిర్వహణకు మేడారంకు ఆవల నాలుగు డంపింగ్ యార్డులు  అదే విదంగా మేడారం పరిసర ప్రాంతాల్లో 300 మిని డంపింగ్ యార్డులు ఏర్పాటు చేశారు.  3450 పారిశుధ్య కార్మికులతో పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసే విదంగా చర్యలు తీసుకుంటున్నారు.

ఎండోమెంట్ శాఖ :
  మేడారం వచ్చే భక్తుల సౌకర్యార్థం మూడు కోట్ల రూపాయలతో ఎండోమెంట్ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆలయాలకు పెయింటింగ్ చేయడం, విద్యుదీకరణ, భక్తులకు రెండు ప్రత్యేక షెడ్ ల నిర్మాణం, మంచినీటి పైప్ ఫైన్ల నిర్మాణ పనులను చేపట్టారు.

విద్యుత్ శాఖ :
  మేడారం జాతరలో నిరంతరం విద్యుత్ సరఫరాకు నాలుగు కోట్ల రూపాయలతో పనులు చేపట్టారు. నుతనంగా 247 ట్రాన్స్ఫార్మర్ల , ఇంతకు ముందు ఉన్న 1033 పోల్స్ కు అదనంగా 1724 కొత్త విద్యుత్ స్తంభాలను, నాలుగు వందల కిలోమీటర్ల కొత్త వైర్ల, 247 డీటీఆర్ లు, ఐదు వేల స్పెసర్లు, పద్నాలుగు కిలోమీటర్ల మేర ఎల్టీ కేబుల్ వైర్ ను విద్యుత్ శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది.

రవాణా శాఖ :
భక్తుల రవాణాకు ఆర్టీసీ ద్వారా 4000 బస్సులను ఏర్పాటు చేశారు. మేడారంలో 40 ఎకరాల్లో తాత్కాలిక బస్ స్టాండ్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాల, 41 టికెట్ బుకింగ్ కౌంటర్లు, లైటింగ్, రైలింగ్ తదితర ఏర్పాట్లు చేసి రవాణాకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు. తాడ్వాయి, కామారం, చిన్నబోయినపల్లి ప్రాంతాల్లో అత్యవసర  పార్కింగ్ స్థలాలను 2.48 కోట్ల నిధులతో ఏర్పాటు చేశారు.

అగ్నిమాపక శాఖ :
అగ్ని ప్రమాదాలు సంభవించకుండా 21 లక్షల నిధులతో ముందస్తు చర్యలు తీసుకున్నారు.10 అగ్నిమాపక వాహనాలు, రెండు మిస్ట్ జీపులు, 20 మిస్ట్ బుల్లెట్ వాహనాలు సిద్ధంగా ఉంచారు.

పోలీస్ శాఖ :
మేడారం లో శాంతి బద్రతలు అదుపులో ఉంచేందుకు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులు సాఫీగా దర్శనం చేసేందుకు  పోలీస్ శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. మేడారం ఆలయ ప్రాంగణం, ఆర్టీసీ బస్ స్టాండ్, జంపన్నవాగు ప్రాంతంలో మూడు ప్రధాన పోలీస్ క్యాంపులతో పాటు 23 మినీ పోలీస్ క్యాంపులు ఏర్పాటు చేసి దాదాపు 12 వేల పోలీస్ సిబ్బందితో 300 సిసి కెమెరాలు, మూడు డ్రోన్ కెమెరాలతో జాతర పరిసర ప్రాంతాలు 32 పార్కింగ్ స్థలాలను  ఎప్పటికప్పుడు  పర్యవేక్షిస్తున్నారు.

వైద్య శాఖ :
భక్తుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య ఆరోగ్య శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. మేడారం కల్యాణ మండపంలో 1.46 కోట్లతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడంతో పాటు పరిసర గ్రామాల్లోను ఏర్పాటు చేసి అవసరమైన మందులు అందుబాటులో ఉంచారు.  అంతే కాకుండా క్యూ లైన్ల వద్ద మినీ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఇందుకు 20 ప్రోగ్రాం ఆఫీసర్లు,  170 మెడికల్ ఆఫీసర్లు, 560 పారామెడికల్ సిబ్బంది, 150 ఆశా వర్కర్లకు విధులు కేటాయించారు.

పర్యాటక శాఖ
ఈ శాఖ  50 లక్షల నిధులు కేటాయించారు. అన్ని సదుపాయాలతో 60 టెంటెడ్ ఆకమాడేషన్లు అలాగే భక్తులకు హరిత రెస్టారెంట్ను అందుబాటులోకి తెచ్చారు.

ఆహార భద్రత శాఖ
జాతరలో ఆహార నాణ్యతను పరీక్షించేందుకు మొబైల్ టెస్టింగ్ మెషీన్ ను ఏర్పాటు చేసి 40 మంది ఎక్ససైజ్ అధికారులతో  ఆరు బృందలగా ఏర్పడి రెండు షిఫ్టులలో తనిఖీలు చేస్తున్నారు.

మత్స్యశాఖ
జంపన్న వాగు ప్రాంతంలో  ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  17.38 లక్షల నిధులతో ముందస్తుగా 300 మంది గజ ఈతగాళ్లను, 50 తెప్పలను 20 సెర్చ్ లైట్లను అందుబాటులో ఉంచారు.