Kalavaibhavam.com(1-Feb): సమ్మక్క సారాలమ్మ మహాజాతర టూర్ బస్ ప్రారంభం

సమ్మక్క సారాలమ్మ మహాజాతర టూర్ బస్ ప్రారంభం

తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో  శ్రీ సమ్మక్క సారలమ్మ ల మహాజాతర మేడారం కు పర్యాటకులకు, భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టూర్ బస్ ను రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లో మంత్రుల నివాస సముదాయంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ భూపతి రెడ్డి గారు, మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్, టూరిజం అధికారులు అంజిరెడ్డి, నేత్ర, రాజలింగం, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పర్యాటక రంగం పై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తున్నారన్నారు.

తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే కాళేశ్వరం టూర్ ప్యాకేజీ కి విశేష స్పందన లభించిందన్నారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న సోమశిల నుండి శ్రీశైలం వరకు క్రూజ్ టూర్ కు పర్యాటకుల నుండి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు గిరిజనుల ఆరాధ్యదైవం శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ ల మహాజాతర కు హైదరాబాద్ నుండి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బస్సు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. మేడారం జాతర యొక్క ప్రత్యేక ప్యాకేజీ యాత్ర హైదరాబాద్-మేడారం- హైదరాబాద్ ఒక్కరోజు ప్యాకేజీ టూర్ కు వోల్వో కోచ్ కు 1500 పెద్దలకు, 1200 పిల్లలకు, నాన్ ఏసీ హైటెక్ కోచ్ కు 1000 రూ. పెద్దలకు, 800 రూ పిల్లలకు టారిఫ్ ను నిర్ణయించామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కోసం మేడారంకు ప్రత్యేక టూర్ లో భాగంగా హెలికాప్టర్ సర్వీస్ ను ప్రారంభించడానికి పరిశ్రమల, ఐటీ శాఖ ల మంత్రి కె.టి. రామారావుతో చర్చించి త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.